సుబ్బిగాడు 2

సుబ్బిగాడు 2 KFC కామాక్షి

అరవింద్ : ఎక్కడికిరా?

సుబ్బి : రావొయి, ఎందుకంత ఆత్రం.. పదా అలా బాయి దెగ్గర కూర్చుందాం అని ముందుకు వెళ్లి కూర్చున్నాడు, ఆ వెనుకే అరవింద్ కూడా వెళ్లి కూర్చున్నాడు.

అరవింద్ : అయినా నాకు అర్ధం కాక ఇప్పుడు నీకెందుకురా అన్ని డబ్బులు?

సుబ్బి : నీకేరా ఎన్నైనా చెప్తావ్ డబ్బులున్నోడివి, అయినా నిన్నని ఏం లాభం కష్టాలన్నీ ఈ ప్రేమికుల చుట్టే తిరుగుతూ ఉంటాయి ఎందుకో అర్ధంకాదు.

సుబ్బిగాడి వంకర మాటలు విని అనుమానంగా కొంపదీసి మళ్ళీ ప్రేమలో పడ్డవా ఏంటి అని అడిగేసాడు అరవింద్.. అవునురా మొన్న నాలుగు రోజుల క్రితమే జరిగిపోయింది నా KFC కామాక్షి తొ..

అరవింద్ : ఎవరా అమాయకురాలు, పాపం పొయ్యి పొయ్యి నీ కంట పడింది..

సుబ్బి : నేను రెంటు కి ఉండే రూం నుంచి ఒక కిలోమీటర్ దూరం అంతే KFC లో పనిచేస్తుంది పిల్ల.. ఏమాటకామాట చికెన్ చెయ్యడంలో ఆ పిల్ల తరువాతే ఏదైనా..

అరవింద్ : KFC లో చికెన్ చెయ్యడమేంట్రా, ఫ్రయర్ లో వేస్తే అదే అవుతుంది దానికి మళ్ళీ ఎదవ ఎలివేషన్లు ఇవ్వకు.

సుబ్బి : నీకేం తెలుసురా ఆ మహిమ.. బర్గర్ చెయ్యాలాంటే చికెన్ పాట్టి, మెయినైస్ అన్ని పెట్టాలి, అలాగే వింగ్స్ ఇవన్నీ బోలెడు ఉంటాయి నీకేం తెలుసోయి పనోళ్ల కష్టాలు ఇటు కాలు తీసి అటు పెట్టాలన్నా నీకు పనిమనుషులు ఉన్నోడివి.. KFC కామాక్షి అంటే తెలీనోడు లేడు ఆ వీధిలో అంత ఫేమస్.

అరవింద్ : సరే సరే నువ్వు KFC కామాక్షి కాకపోతే డామినోస్ దుర్గని లవ్ చేస్కో నాకెందుకు, ఇప్పుడు మీ తాత తోటి అంత అవసరమేంటని?

సుబ్బి : నా కామాక్షికి ఎప్పటి నుంచో సొంతగా తనే వ్యాపారం పెట్టుకోవాలని కోరికట దానికోసం కొంత డబ్బు అవసరం, ఎవరో ఎందుకు అదేదో నేనే పెట్టుబడి పెడితే ఎంచక్కా ఇద్దరం కలిసి ఆడుతు పాడుతూ చికెన్ ఎంచుకోవచ్చు అని ఆలోచిస్తున్నా.. పేరు కూడా డిసైడ్ చేసేసా కొంత డబ్బు ఉంటే చాలు.

అరవింద్ : ఏం పేరు?

సుబ్బి : సుబ్బిగాడి నూనెలో కామాక్షి చికెన్.. ఎలా ఉంది..

అరవింద్ : నీలాగే ఉంది.

సుబ్బి : థాంక్స్ రా..

అరవింద్ చుట్టూ చూస్తూ సుబ్బిగాడు చెప్పే సొల్లంతా వింటున్నాడు కానీ ఇందాకటి నుంచి ఒకటి కొట్టేస్తుంది అది ఏంటంటే డబ్బులు తనని అడగకుండా ఇంత దూరం వాళ్ళ తాతయ్య కోసం వచ్చాడేంటా అని, మళ్ళీ అడిగితే గెలికి మరి తన్నించుకున్నట్టు ఉంటుందని చాలా సేపు మౌనంగానే ఉన్నాడు కానీ తన వల్ల కాక చివరికి అడిగేసాడు.

సుబ్బి : ఆదా.. ఎలాగో పాకెట్ మనీ రావాలి, అలాగే ఇది కూడా వర్కౌట్ చేద్దామని వచ్చా అంతే, నీకైతే మళ్ళీ కట్టాలి కదా.

అవును అదే అనుకున్నా అని మనుసులో అనుకుని బైటికి మాత్రం ఓ చిన్న నవ్వు నవ్వాడు. ఇద్దరు ఊరు చూసి ఇంటికి వెళుతూ గుమ్మం ముందు తాతయ్య చెప్పులు చూసి సుబ్బిగాడు ఆనందంగా లోపలికి వెళ్ళాడు.

ఆయన పేరు రాజయ్య అంతగా పూర్వ ఆస్తులు ఏమి లేవు నలుగురి సంతానంలో రెండో వాడు, ఉన్న ఆస్తులని తెలివిగా పెంచుకున్నాడు, ఈయన కున్న ఒకే ఒక్క బాధ మన సుబ్బిగాడే.. వీడు ఒకింటి వాడు అయితే ఇక తనకీ ఏ బాధ్యతలు ఉండవని ఆయన ఫీలింగ్.

సుబ్బిగాడు లోపలికి వెళ్లేసరికి అరవింద్ కి ఏం తోచక బైటే టెంట్ కింద కూర్చుండిపోయాడు, అది చూసిన శరణ్య అండ్ గ్యాంగ్ వెళ్లి అరవింద్ చుట్టూ చేరేసరికి అయోమయంగా చూసాడు.

శరణ్య : హాయ్, నేను శరణ్య.. మీ ఫ్రెండ్ శుభాష్..

అరవింద్ : నాకు తెలుసు.

శరణ్య : ఓహ్ ఓకే.. వీళ్ళు మా ఫ్రెండ్స్ మిమ్మల్ని పరిచయం చెయ్యమని అడిగితే తీసుకొచ్చాను.

అరవింద్ : అలాగా (అన్నాడు, లోపల మాత్రం భయం భయంగానే ఉంది)

“మీ ఫ్రెండ్ గురించి చెప్పండి, బాగా కామెడీ చేస్తాడట కదా”

అరవింద్ : అవును, ఏం?

“ఊరికే చెప్పండి బోర్ కొడుతుంది, కొంచెం సేపు టైమ్ పాస్ అవుద్ది”

అరవింద్ : వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు నవ్వుతూ నవ్వుస్తూనే ఉంటాడు, బాధల్లో ఉన్నా అవమానల్లో ఉన్నా అందులో నవ్వుని మాత్రమే తీసుకుంటాడు, వాడు చేసే ప్రతీ పనిలో ఫన్ వెతుక్కుంటాడు, ఒక రోజు చెప్పాను ఒక అమ్మాయిని లవ్ చెయ్యరా అందులో కూడా ఫన్ ఉంటుంది, నీకొక తోడు దొరుకుతుంది అని.. అదే నేను చేసిన పెద్ద తప్పు, అప్పటి నుంచి అమ్మాయిల మీద యుద్ధం ప్రకటించాడు వాళ్లలో కొంచెం పాజిటివ్ కనిపించినా చాలు వాళ్ల వెనకాలే వెళ్ళిపోతాడు..

“తన లవ్ స్టోరీస్ గురించి చెప్పండి”

అరవింద్ : అయితే మీకు మొదటగా బఠానీల భారతి గురించి చెప్పాలి.

శరణ్య : హహ

ఇంతలో లోపల నుంచి పెద్దాయన అరుపు విని అందరూ లోపలికి వెళుతుంటే అరవింద్ కూడా లోపలికి వెళ్ళాడు తన వెనకాలే శరణ్య కూడా వెళ్ళింది. అక్కడ లోపల సుబ్బిగాడు కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నాడు, ఏమైంది అంటూనే రాజయ్యని చూసాడు.

రాజయ్య : ఏం కాలా.. వాడు డబ్బు అడిగాడు, ఇవ్వాల్టి నుంచి నేను ఇవ్వను ఉద్యోగం చూసుకోమన్నాను. అంతే..

అరవింద్ : దానికే కళ్ళు తిరిగి పడిపోయాడా?

రాజయ్య : ఆ! అలాగే నా తమ్ముడి మనవడికి వచ్చిన సంబంధం మాట్లాడుతూ ఈ ఫోటో చూపించాను, అంతే గిర్రున పడ్డాడు.

అరవింద్ ఆ ఫోటోని చూసి గట్టిగా నవ్వాడు, అది శరణ్య గమనించింది.. సుబ్బిగాడి మొహం మీద నీళ్లు చల్లేసరికి లేచి అందరినీ చూసి మౌనంగా బైటికి వెళ్ళిపోయాడు.

బైటికి వచ్చాక శరణ్య అడిగింది.

శరణ్య : ఏమైంది.. ఇందాక నువ్వు నవ్వావు..

అరవింద్ : ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని పోయిన గురువారం నుంచి మీ బావ ప్రేమిస్తున్నాడు, ఈ గురువారంతొ ఎండ్ కార్డ్ పడేసరికి కళ్ళు తిరిగి పడిపోయాడు. పాపం వాడికే ఎందుకు జరుగుతాయో అర్ధం కాదు..

శరణ్య నవ్వేసరికి అరవింద్ కూడా నవ్వాడు.. ఇదంతా మన సుబ్బిగాడు గమనించాడు.. కోపంగా పళ్ళు నూరుముకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు..

కేక్ కటింగ్

శరణ్యతొ మాట్లాడి అరవింద్ రూంలోకి వెళ్లి అక్కడ సుబ్బిని చూసి వెళ్లి పలకరించాడు.

సుబ్బి : ఏంటి నీకు దానితో ముచ్చట్లు?

అరవింద్ : నీ కామాక్షి గురించె, ఏదైనా హెల్ప్ చేస్తుందేమో అని గెలికాను కానీ ఉపయోగం లేదు.

సుబ్బి : నేనంటే ఎంత ప్రేమరా నీకు.. అయినా వద్దులే వదిలేయి.

అరవింద్ : ఏరా, వెళ్లి మీ తాతయ్యకి చెప్పొచ్చు కదా..

సుబ్బి : వదిలేయిరా, వేదనకి గురైన మనసు వాదనకు దిగలేదు.

అరవింద్ : (అబ్బో కవిత్వం..) సరే రా, ఇంతకీ మీ తాతయ్య ఏమన్నాడు?

సుబ్బి : వద్దు ఇక అలా పిలవద్దు, ఇంతటితో ఆయనకి నాకు సంబంధాలు తెగిపోయాయి.

అరవింద్ : ఏమైంది రా?

సుబ్బి : డబ్బులు అడిగాను, ఇవ్వనన్నాడు. కనీసం ఈ నెల పాకెట్ మనీ ఇవ్వమని అడిగాను రా, అవి కూడా ఇవ్వనన్నాడు రా ముసలోడు. నన్ను.. పైగా ఉద్యోగం వెతుక్కోమని సలహాలు కూడా ఇచ్చాడు, నాకు నా కామాక్షిని దూరం చేసాడు.. (కోపంగా ఊపిరి పీల్చుకుని అటు ఇటు తిరిగి) ఆలరైట్.. ఇట్స్ ఆలరైట్.. నేనూ… సుభాష్.. నన్ను ఎవ్వరు మోసం చెయ్యలేరు.. ఇవ్వాల్టి నుంచి మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలెడతాను.. డే వన్.. మొదటి టార్గెట్ కవిత.. కానీ అరవింద్.. నీకొక బౌంటీ.. ఆ కవితని నాకు సెట్ చేస్తే నీకు లైఫ్ టైం సెటిల్మెంట్ రా..

అరవింద్ : రేపటి నుంచి వీడు తినాలన్నా నా ఇంటికే రావాలి, వీడు నాకు లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తాడంట.. మనసులో తిట్టుకున్నా బైటికి మాత్రం ఇంతకీ ఆ కవిత ఎవరు రా?

సుబ్బి : అదేరా శరణ్య పక్కన పచ్చ రంగు ఓణి వేసుకుని లేదు. ఆ అమ్మాయే..

అరవింద్ : మరి కామాక్షి..?

సుబ్బి : ఇంకెక్కడ కామాక్షి.. ఇంకొకడికి కాబోయే అమ్మాయి వెంట నేను పడను.

అరవింద్ : అది సరే.. ఈ అమ్మాయిని ఎప్పుడు చూసావ్..?

సుబ్బి : అది అంతేరా, పారల్లెల్ వరల్డ్.. నీకు అర్ధం కాదులే.. వదిలెయ్యి.. ఇక పదా కేక్ కటింగ్ కి వెళదాం అని బైటికి నడిచాడు.. తన వెనకే అరవింద్ కూడా అయోమయంగా బైటికి నడిచాడు.

మా తాత అందరినీ పిలిచి కేక్ కట్ చేపించి భోజనాలు కూడా పెట్టాడు, అదేంటో మనకి కనీసం విషెస్ కూడా చెప్పరు ఎవ్వరు, అయినా అదే మంచిదిలే వాడు విషెస్ చెప్పడం నేను థాంక్స్ చెప్పడం ఇంకో రెండు నిమిషాలు మాట్లాడాలి టైం బొక్క.. ఆలోచిస్తుండగానే శరణ్య పేపర్ ప్లేట్ లో కేక్ ముక్క తీసుకుని నా ముందుకి వచ్చింది.

శరణ్య : ఇదిగో కేక్, దీని కోసమేగా నువ్వు వచ్చింది.. పెద్దది పట్టుకొచ్చా సిగ్గులేకుండా మెక్కు.. అని నా చేతిలో పెట్టింది.

తిరిగి వెళ్లిపోతుంటే పిలిచాను.

సుబ్బి : ఇదిగో పిల్లా ఇటు రా.. నాకో సాయం కావాలి.

శరణ్య : ఏంటి నన్నే?

సుబ్బి : నిన్నే ఇలా రా..

శరణ్య : ఆ.. ఏంటి?

సుబ్బి : కొంచెం నీ ఫ్రెండ్ కవితని నాకు పరిచయం చెయ్యొచ్చుగా..

శరణ్య : (గట్టిగా నవ్వుతూ) మరి KFC కామాక్షి?

సుబ్బి : నీకెలా తెలుసు..

శరణ్య : నీ ఫ్రెండ్ చెప్పాడులే.. అయినా కవితని సెట్ చేస్తే నాకేంటి?

సుబ్బి : ఏంటి నిజంగానే మా ఇద్దరినీ కలుపుతావా?

శరణ్య : అబ్బో.. సరే చెప్తాను, ఆ తరువాత నన్ను అడగొద్దు.

సుబ్బి : నిజంగానేనా.. మోసాలు ఏం లెవ్వుగా.. నిజం అయితే ఇక నీతో అస్సలు గొడవ పడను.. ఇదిగో ఈ లెటర్ ఇవ్వు..

శరణ్య : అబ్బో లవ్ లెటరా.. అని తీసుకుని వెళ్ళిపోయింది.

సుబ్బి : ఎక్కడో తేడా కొడుతుందేంటి.. ఇదింత కామ్ గా పోయింది… సర్లే చూద్దాం.. ముందు ఆకలేస్తుంది.. వీడెక్కడా కనిపించడంలేదు..

శరణ్య లెటర్ తీసుకుని అది చదివి గొల్లుమని నవ్వుతూ తన ఫ్రెండ్స్ దెగ్గరికి వెళ్ళింది, కడుపు పట్టుకుని నవ్వుతుంటే విషయం చెప్పింది.. అందరూ చదవమని గోల చేస్తే, అలాగే అని అందరినీ పిలిచింది.. ఏంటో అని ఇంట్లో వాళ్లంతా వెళ్లారు.. ఆ గోలెంటో చూద్దామని సుబ్బిగాడు కూడా వెళ్ళాడు..

శరణ్య : ఇదిగో వినండి అందరూ.. మన సుబ్బిగాడు నా ఫ్రెండ్ కవితకి ఉత్తరం రాసాడు.. అని నవ్వింది.

శరణ్య వాళ్ల నాన్న, తాతయ్య సుబ్బిగాడిని కోపంగా చూసారు, ఇక సుబ్బిగాడి గుండె గువ్వలోకి వచ్చినట్టు అయ్యింది పరిస్థితి ఈ శరణ్య ఇంత పని చేస్తుందని అనుకోలేదు.. వద్దని శరణ్య వైపు దీనంగా చూసాడు కానీ తను పట్టించుకునే స్థితిలో లేదు.

శరణ్య : ఇదిగో వినండి..

కవితా ఓ కవితా (ఎహె వహ్వా అనండి)
అందరూ “వహ్వా వహ్వా”

కవితా ఓ కవితా
అందుకో నా కవిత
నీకోసం ఈ కవిత రాసే వరకు తెలీదు నాకు బిట్కో పెన్ను మూడు రూపాయలని
నిన్ను తలుచుకుంటే పిచ్చెక్కిపోతుంది, గుండె బరువెక్కుతుంది, టైర్ పంచరవుతుంది..

చూసావా కవితా… నీ కోసం కవిత రాస్తుంటే నా కలం కూడా నా మాట వినట్లేదు. నువ్వైనా విను కవితా..

నీ తుట్టేలో తేనెనవుతా
నీ పుట్టలో పామునవుతా
బొగ్గు గనిలో.. ప్రేమ
అగ్గి పెట్టలా
తాటి చెట్టు, చెయ్యి పట్టు, చిన్నదాని చెయ్యే పట్టు.. ఓ బుల్లోడా
ఏమో ఏం రాస్తున్నానో నాకే అర్ధం కావటంలేదు.. నా బాధ గాధ నీకైనా అర్ధం అవుతుందేమో..

చివరిగా..
నా పొలంలో కూడా మొలకలు వచ్చేలా చూడు కవితా..

ఇట్లు నీ సుబ్బడు..
సుభాష్.

ఇంట్లో ఉన్న అందరూ ఒక్క సారి సుబ్బిగాడి మొహం వంక చూసి పిచ్చి పిచ్చిగా కడుపు పట్టుకుని నవ్వారు, సుబ్బిగాడికి కోపం వచ్చేసి బైటికి పరిగెత్తాడు.. వెనకనుంచి KFC కామాక్షి అన్న అరుపు వినిపించింది.. అంతా ఈ అరవింద్ గాడి వల్లే మొత్తం చెప్పేసాడు.. అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోయాడు.. అరవింద్ వెనకాలే వేగంగా నడిచాడు..

అరవింద్ : రే… ఆగరా

సుబ్బి : ఏంట్రా.. అయినా నీకు నాతో ఏం పని, పొయ్యి ఆ ఆడంగులతొ తిరుగుపొ..

అరవింద్ : రేయి.. ఆగరా బాబు.. నేను నీకు హెల్ప్ చేద్దామని చూస్తే ఏదేదో అయిపోయింది..

సుబ్బి : ఏం గెలికావ్?

అరవింద్ : ఏదో గెలికాలే.. ఇంతకీ ఎక్కడికి వెళుతున్నావ్..

సుబ్బి : జాతరకి

అరవింద్ : పదా..

సుబ్బి : ఎందుకూ, నన్ను ఎదవని జేయ్యడానికా?

అరవింద్ : ఇక నీ విషయంలో వేలు పెట్టను సరేనా… అయినా ఆ కవిత్వం ఏంటిరా అంత చెండాలంగా..?

సుబ్బి : అది కవిత కోసం రాసాను, తను చదువుకొని నవ్వుకుంటుందని.. ఎలా అయినా నాతొ మాట్లాడాలని అలా రాసాను.. కానీ ఆ శరణ్య.. దాన్ని వదలను..

అరవింద్ : రేయ్ మీ వాళ్లు కూడా జాతరకి వస్తున్నారు..

సుబ్బి : ఎక్కడా?

అరవింద్ : అక్కడా

సుబ్బి : ఇప్పుడేగా మెక్కింది అందరూ, అప్పుడే రోడ్డున పడ్డారు.. ఛీ ఎక్కడా ప్రశాంతంగా ఉండనివ్వరు…

ఇంతలో సుబ్బిగాడికి పక్కనే స్టేజి, నాటకాలు వేసే వారు కనిపించారు.. అరవింద్ వాళ్ళని పలకరించబోయే అంతలో మాయం అయ్యాడు..

శరణ్య : హే.. అరవింద్.. మీరు ఇక్కడికే వచ్చారా?

అరవింద్ : ఎందుకలా చేసావ్?

శరణ్య : జస్ట్ ఫర్ ఫన్.. వాడేం ఫీల్ అవ్వడులే.. నా మీద ఇంకొంచెం కోపం పెరిగి ఉంటది అంతే..

అరవింద్ : కానీ..

శరణ్య : ఇంతకీ ఎక్కడ వాడు..

అరవింద్ : ఇక్కడే ఉండాలి, ఎక్కడికి పోయాడో..

మన సుబ్బిగాడు నాటకాలు వేసే వాళ్ల దెగ్గరికి వెళ్లి, అన్నా మీది ఎలాగో టైం పట్టేలా ఉంది కొంచెం సేపు నేను అలా మైక్ లో మాట్లాడనా, అందరికీ తెలుస్తుంది.. కొద్ది సేపటిలో నాటకం మొదలవుతుందని.. అని అడిగాడు.. దానికి వాళ్లు సరే కానీ అన్నారు.. అక్కడున్న స్వామీజీ గెటప్ ఒకటి వేసుకుని గడ్డం పెట్టుకుని మైక్ అందుకుని స్టేజి ఎక్కాడు..

“హలో.. మైక్ టెస్టింగ్ 123… కూ… చెక్ చెక్..”

జనులారా, మరికొద్దిసేపటిలో ఇక్కడ జరగబోయే నాటకానికి మీకందరికి ఆహ్వానం.. కానీ అది మొదలయ్యేలోగా మీకు కొన్ని సూక్తులని చెప్పాలని అనుకుంటున్నాను… టాపిక్ డబ్బులున్నోళ్లు.. వాళ్ల తప్పులు..

ఆ మాట వినగానే అందరూ ఒకసారి స్టేజి మీద ఉన్న స్వామీజీని చూసారు.. ఉన్నోళ్ల పిల్లల చేతిలో తన్నులు తిని కూర్చున్న పేద పిల్లల బ్యాచ్ ఒకటి కూడా ఇదేదో మ్యాటర్ అని వెళ్లి నిల్చున్నారు..

స్వామీజీ : అదిగదిగో చూడండి, ఆ ముసోలోన్ని చూసారా అనగానే దారిన పోయే వాళ్లు కూడా స్వామీజీని చూసి, స్వామీజీ చూపించిన వేలి వైపు చూసారు.. అక్కడున్నది రాజయ్య తన పక్కనే కొడుకు శరణ్య వాళ్ల నాన్న..

స్వామీజీ : చూసారా.. మూలన కూర్చోవాల్సిన వయసులో, ఆ పంచ.. చేతికి ఉంగరాలు.. కుర్రాడి లా తయారయ్యాడు, అందరినీ చూడండి ఎలా ఉన్నారో ఆయన్ని చూడండి ఎలా ఉన్నాడో.. దీనికి కారణం డబ్బు మహిమ ఇంత మైంటైన్ చేసినా ఒక్క రూపాయి కూడా జారరు, పిసినారులు.. ఇక ఆ పక్కనే ఉన్న వాడిని చూడండి డబ్బులు వడ్డీకి తిప్పి పేదల రక్తాన్ని వడ్డీ రూపంలో పీల్చుకుని తినెలా లేడు.. చూసారా నేను ఇంత చెప్తున్నా కనీసం నిమ్మకు నీరెత్తనట్టు పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు..

ఆ వెనకే ఇంకో ప్రబుద్ధుడు ఉన్నాడు చూడండి.. మిత్ర ద్రోహి.. పక్కనే అమ్మాయిని తెగ గోకుతున్నాడు… (ఈ మాటలు వినగానే శరణ్య పక్కనుంచి పది అడుగుల దూరంగా పారిపోయాడు అరవింద్) … నమ్మొద్దు మిత్రులారా నిలువునా ముంచుతారు.. ఇక ఆ అమ్మాయిని చూడండి ఎంతలా కులుకుతుందో.. వీళ్ళ పాపాలు చూడలేకున్నాను.. హత్తవిది.. అంటుండగానే ఎవరో మన సుబ్బిగాడి గడ్డం పట్టుకుని లాగారు.. చూస్తే హారిక.. గుర్తుపట్టేసింది.. అక్కడున్న అందరూ సుబ్బిగాడిని చూసారు.. వెంటనే శరణ్య వాళ్ల నాన్న కర్ర అందుకున్నాడు.

~ ఇక నుంచి కథ మొదలు